ICC Champions Trophy 2025: లెహ్రా దో..చక్ దే ఇండియా! ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్! 1 month ago

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్..రాచిన్ రవీంద్ర వేగవంతమైన బాటింగ్ తో సూపర్ స్టార్ట్ అందుకుంది. ఒక దశలో భారీ స్కోర్ అంచనా వేసిన సమయంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మాయాజాలంతో కివీస్ ను కట్టడి చేశారు.
రచిన్, కేన్ విలియమ్సన్ వంటి కీలకమైన వికెట్లు తీసి కుల్దీప్ యాదవ్ కివీస్ జట్టును దెబ్బతీశాడు. డారిల్ మిచెల్(63)..గ్లెన్ ఫిలిప్స్ (34) భాగస్వామ్యంతో కివీస్ ను ఆదుకోగా.. చివరి 10 ఓవర్లలో మైఖేల్ బ్రేస్‌వెల్ (53*) మెరుపు ఇన్నింగ్స్ తో వేంగంగా పరుగులు చేసి జట్టు స్కోరును 250 దాటించాడు. వరుణ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.. కెప్టెన్ సాంట్నర్ ను కోహ్లీ రన్-అవుట్ చేయగా.. షమీ, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసి.. 251 పరుగులకు 7 వికెట్ల నష్టానికి కివీస్ ఇన్నింగ్స్ ను ముగించారు. భారత ఫీల్డింగ్ లో కొన్ని క్యాచ్‌లు మిస్ అయినా, బౌలింగ్ లో అద్భుతంగా రాణించారు.
252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (76) అర్ధ సెంచరీతో శుభారంభం పలికాడు. కెప్టెన్ కు సహాయంగా గిల్ (31) నిదానంగా రాణించడంతో భరత్ కు మంచి స్టార్ట్ లభించింది. విజయభేరిలో నడుస్తున్న టీమ్ ఇండియాకు గిల్ వికెట్ తీసి కెప్టెన్ సాంట్నర్ బ్రేక్ వేసాడు. వెంటనే కోహ్లీ కూడా ఒక్క పరుగుకే అవుట్ కావడంతో భరత్ చిక్కులో పడింది. కివీస్ స్పిన్నర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో కెప్టెన్ రోహిత్ వికెట్ పోయి భారత్ కు గెట్టి దెబ్బ పడింది. ఒక్కసారిగా ఆటమొత్తం తిరిగిపోవడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలయింది.
ఇలాంటిఇ కష్టకాలంలో శ్రేయాస్ అయ్యర్ (48).. అక్షర్ పటేల్ (29) భాగస్వామ్యంతో టీమ్ ను ఆదుకున్నారు. రాహుల్ (34*), హార్దిక్ (18) అద్భుతమైన ప్రదర్శనతో భరత్ కు విజయం అందించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే తమ లక్ష్యాన్ని చేధించారు. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టడంతో స్టేడియంతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు మారుమోగాయి. ఇక క్రీజులో మరో ఎండ్‌లో నిలిచిన కేఎల్ రాహుల్ తన చేతులను పైకెత్తి వేడుకలను ప్రారంభించాడు. ఆ వెంటనే హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ మొదటగా మైదానంలోకి పరుగులు తీశారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ వచ్చారు.
మరోవైపు సీనియర్ ఆటగాళ్లు డగౌట్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి సంబరాలు మొదలు పెట్టారు. మైదానంలోకొచ్చి కోహ్లీ-రోహిత్లు సంతోషంతో స్టంప్స్ తో దాండి ఆట ఆడారు. స్టేడియం మొత్తం బాణ సంచా పేలుళ్లతో.. ఆ కాంతి వెలుగులో ఒక పండగ వాతావరణం నెలకుంది. గత 15 సంవత్సరాలుగా విజయానికి అడ్డుపడుతున్న కివీస్ పై ఘన విజయం సాధించి భారత్ పగతీర్చుకుందని ఫ్యాన్స్ సంబరిపడిపోయారు.
రోహిత్ శర్మ నాయకత్వంలో మొదటి సారి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఈ టోర్నీ మొత్తం భారత్ అన్‌స్టాపబుల్ టీమ్ గా రాణించి.. భారత్ పెద్ద మ్యాచ్‌లలో తడబడుతున్నారనే విమర్శలను చెరిపేస్తూ సత్తా చాటింది. ఒక్కసారిగా స్టేడియం మొత్తం “లెహ్రా దో”, “చక్ దే ఇండియా” నినాదంతో మోతమోగిపోయింది. కివీస్ కెప్టెన్ సాంట్నర్ కూడా భారత్ ఆటగాళ్లను ప్రశంసించాడు. తమ ప్లేయర్స్ బాగా ఆడారని..ఇండియా ఒక గొప్ప టీమ్ అని.. ఫైనల్ ఓడినందుకు బాధ లేదని.. ఒక గొప్ప టీమ్ మీద ఒడామని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇది ఒక గొప్ప విషయం.. ఈ విజయంతో సీనియర్ ప్లేయర్లు.. రేపటి తరానికి మంచి స్ఫూర్తినిచ్చారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా భారత్ జట్టు అధిగమిస్తుందని చాటి చెప్పారు. 2023 ప్రపంచ కప్ ఓటమి భారత జట్టులో ఒక కొత్త స్ఫూర్తిని నింపింది. అప్పటి నుంచి.. వారు ఐసీసీ ఈవెంట్లలో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతున్నారు. మైదానంలోనే కాకుండా.. ఐసీసీ బోర్డుల్లో, అలాగే అభిమానుల హృదయాలలో కూడా భారత్ తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.